Thursday 1 January 2015

విజయపథం

0 comments

లోకంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ తమ తమ రంగాల్లో తప్పక విజయా న్ని సాధించాలని కోరుకుంటూనే ఉంటారు. ఆటల్లో, పాటల్లో, మాటల్లో, వివిధ వ్యవహారాలలో, విద్యా ఉద్యోగ వ్యాపార పరిపాలనాది రంగాలలో విజయాన్ని స్వంతం చేసుకోవాలనుకునేవారి కి జిహ్వా యేన జితా త్రైలోక్యమపి తేన జితం అనే సూక్తి ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తున్నది.

ఎవరైతే నాలుకను గెలుస్తారో, వారు ముల్లోకాలను గెలిచినట్లేనట. నాలుకను గెలవడం అంటే .... నాలుకతో చేసే రెండు పనులలో జాగ్రత్త వహించటమే.

1)నాలుకతో మాట్లాడే మాటలపై నియంత్రణ కలిగియుండటం. అవసరమైన మాటలనే మాట్లాడ టం. మితిమీరి మాట్లాడకపోవటం.

 2)నోటితో తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించటం. కొందరు రుచికరమైన పదార్థాలపై వ్యామోహంతో ఎంతపడితే అంత, ఎక్కడపడితే అక్కడ, ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తింటూ రకరకాల అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటూ ఉంటారు. జిహ్వాచాపల్యంతో తినడానికే బ్రతుకుతున్నట్లుగా భావిస్తారు. ఇది సరికాదు. నాలుకను తమ నియంత్రణలో పెట్టుకున్న మహనీయులు మాత్రం మితమైన, హితమైన ఆహారాన్ని తీసుకుంటూ బతకడానికే తిండి అనే యథార్థ బుద్ధితో జీవిస్తారు. ఈ విధంగా మాట్లాడే మాట విషయంలో, తినే తిండి విషయంలో ఒక క్రమపద్ధతిని ఏర్పరచుకున్నవారికి ముల్లోకాల్లో విజయమే తప్ప పరాజయం ఉండదు.

అన్ని అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తే సకల కార్యాలను అవలీలగా చేస్తూ విజయపరంపరను స్వంతం చేసుకోవచ్చని అందరం భావిస్తూ ఉంటాం. అయితే మూగతనం, చెవిటిత నం, గుడ్డితనం అనేవి ఎవరిలో ఉంటే వారే ముల్లోకాలను అవలీలగా గెలవగలుగుతారని ఒక కవి చమత్కారంగా పేర్కొన్నాడు.

మూగతనాన్ని, చెవిటితనాన్ని, గుడ్డితనాన్ని కలిగియుంటే విజయాలు ఎట్లా స్వంతం అవుతాయి? అనే ప్రశ్నకు సమాధానంగా కవి-ఇతరులను అవమానించ టంలో మూగవారిలాగా, ఇతరులు తమను అకారణంగా నిందించే సమయంలో చెవిటివారిలాగా, ఇతరుల దోషాలను చూసే విషయంలో గుడ్డివారిలాగా ఎవరు వ్యవహరిస్తారో వారికి ముల్లోకాల్లో ఎదురు ఉండదు, సమస్త వ్యవహారాల్లో విజయాలు వరిస్తాయి -


పరివాదేషు యే మూకా - బధిరాశ్చ పరోక్తిష
పరరంధ్రేషు జాత్యన్ధాః - తైర్జితం భువనత్రయమ్ ॥


అని సకలజన రంజకంగా కర్తవ్యోపదేశపరంగా కవి పలికిన పసిడిపలుకులలోని ఆంతర్యాన్ని గ్రహిద్దాం. ఆచరించే ప్రయత్నం చేస్తూ విజయపథంలో పయనిద్దాం.
-సముద్రాల శఠగోపాచార్యులు

0 comments:

Post a Comment