Thursday 12 July 2012

శ్రీ సంగమేశ్వరుడు

0 comments

భగవంతుడు గొప్ప ప్రకృతి ప్రేమికుడు. ఆయన ఎక్కడ వెలసినా చుట్టూ చక్కని కొండలు, కోనేళ్ళు,నిర్మలంగా పారే నదులు, హరితకాంతులు వెదజల్లే అటవీకసీమలు చూసుకౌని మరీ అవతరిస్తాడు. అలాగే శివుడు కూడా " సంగమేశ్వరుడు" గా అలాంటి ప్రదేశాన్నే ఎన్నుకొని కొలువుదీరి భక్తుల ఆరాధనలందుకుంటూ ఉన్నాడు.

వీరపునాయనిపల్లె అనిమెల గ్రామానికి దగ్గర సంగమేశ్వర స్వామి ఆలయమున్నది. పాపాఘ్ని, మొగమూరు నదుల సంగమం చెందే చోట వెలసిన శివుడు కనుక " సంగమేశ్వరుడు"అనే పేరు ఏర్పడింది.

శ్రీసంగమేశ్వరస్వామివారి లింగమును స్వయంగా అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం వెల్లడిస్తూ ఉంది.పూర్వం ఈ ప్రాంతంలో సప్తఋషులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకునేవారు. అలా తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో అగస్త్యమహాముని శివలింగమును ప్రతిష్ఠించి ప్రతిరోజూ అభిషేకించి అర్చనలు నిర్వహించేవాడు. కాగా కలియుగ ప్రవేశం తర్వాత పూజాపునస్కారములు లేకుండా పోవడంతోపాటు కాలక్రమములో శివలింగం భూమిలో పూడిపోయింది. చాలాకాలం తర్వాత మళ్ళీ శివలింగం బయటపడింది. అందుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన గాధ ఉన్నది.
ఈ ప్రాంతాన్ని పరిపాలించే సూర్యవంశ రాజుగారికి పెద్ద ఆవులమంద ఉండేది. పశువుల కాపరులు ఆవులను తోలుకుని మేపడానికి ఈ ప్రాతాంలోని అడవులకు వెళ్ళేవారు. అలా ఆవులన్నీ అడవికిచేరుకుని మేతమేసి తిరిగి సాయంత్రానికి గోశాలకు చేరేవి.అడవికి వెళ్ళే ఆవుల్లోని ఒక ఆవు మేతమేసి తిరిగి గోశాలకు వెళ్ళేముందు మందను వదలి దూరంగా వెళ్ళి ఒక పుట్టపై నిలబడి పాలను ధారగా వదలి అనంతరము గోశాలను చేరేది. వట్టి పొదుగుతో గోశాల చేరే ఆవును చూసి పశువుల కాపరికి అనుమానం కలిగింది. ఒకరోజు అడవికి వెళ్ళిన సమయంలో ఆ ఆవును అనుసరించసాగాడు. ఆవు ఎప్పటిలాగానే సాయంత్రం కాగానే పుట్టవద్దకు వచ్చి లోపలి శివలింగంపై పాలు ధారగా వదలడం చూసి కోపాన్ని అణుచోలేక చేతిలోనున్న గొడ్డలితో ఆవును కొట్టాడు. ఆవు తప్పించుకోగా, ఆ దెబ్బ పుట్టలోని శివలింగమునకు తగిలింది. దీనితో మరింత రెచ్చిపోయిన పశువుల కాపరి ఆవును కొట్టడానికి మళ్ళీ గొడ్డలిపైకి ఎత్తడంతో " నేను సంగమేశ్వరుడిని, ఈ పుట్టలో ఉన్నాను. ఈ ఆవు ప్రతిరోజు నాకు పాలు ఇస్తూ ఉంది.పుట్టను తొలగించి నన్ను బయటకు తీసి ఆలయం నిర్మించి పూజలు చేయండి, మేలు జరుగుతుంది" అనే మాటలు పుట్టనుంచి వినిపించాయి. ఈ విషయమును పశువులకాపరి రాజుకు తెలుపగా రాజు పుట్టను త్రవ్వించి సంగమేశ్వరలింగమును బయటకుతీసి ఆలయం నిర్మించి పూజా పునస్కారాలను ప్రారంభింపజేసినట్లు స్థలపురాణం వెల్లడిస్తున్నది.
ఎత్తైన కొండలు, గలగలా పారేనదులు వంటి సుందర ప్రకృతి దృశ్యాల నడుమ సంగమేశ్వరస్వామి ఆలయం ప్రాచీన కళావైభవానికి, అపురూప అధ్యాత్మిక సంపదకు ఆలవాలమై అలరారుతున్నది. ఆలయమునకు ఉత్తరంవైపున ఎత్తైన కొండలు,దక్షిణం వైపున నది, పడమరదిశలో రెండు నదులు సంగమిస్తూ ఉన్న అద్భుతదృశ్యం భక్తులకు నయనానందాన్ని కలిగిస్తుంది. తూర్పు అభిముఖంగా ఉన్న ఈ ఆలయం ఎత్తైన గోపురాలతో, విశాలమైన మండపాలతో,అద్భుతమైన శిల్పసంపదతో, అపురూపమైన దేవతామూర్తులతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది. ఆలయమునకు నాలుగువైపులా దారులు ఉన్నా ప్రధాన ద్వారంపై మూడు అంతస్తుల గోపురం దానిపై ఐదు కలశములు దర్శనమిస్తాయి. పడమర ద్వారంపై ఐదు అంతస్తుల గోపురం దానిపై ఏడు కలశములు నిర్మించబడి ఉన్నాయి. దక్షిణ ద్వారాలపై మండపములు నిర్మించారు కానీ గోపురములు నిర్మించలేదు. దక్షిణ ద్వారం నుంచి ప్రక్కనే ప్రవహిస్తున్న నదిలోనికి మెట్లమార్గం నిర్మించబడినది. తూర్పు ద్వారం నుంచి ఆలయంలోనికి ప్రవేశించగానే విశాలమైన ప్రకారంలో ఆలయం దర్శనమిస్తుంది. ప్రధాన ఆలయం రంగమండపం, ముఖమండపం, అంతరాళమండపం, గర్భాలయాలతో ప్రశాంతత కలిగిస్తుంది.
రంగమండం నుంచి ముఖమండపంలోనికి ప్రవేశించే ద్వారానికి దక్షిణం వైపున వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు. ముఖమండపంలో శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు. శివలింగంపైన కొంత గుంత ఉంది. అది గొడ్డలిదెబ్బ. రంగమండపంలో ఉత్తరం వైపున సంగమేశ్వరస్వామి దేవేరి అయిన పార్వతీ దేవి ప్రత్యేక గర్భాలయంలో కొలువుదీరి ఉన్నారు. దక్షిణాభిముఖంగా నున్న శ్రీపార్వతీదేవి నిలుచున్న భంగిమలో దర్శనమిస్తాడు. చతుర్భుజి అయిన శ్రీపార్వతీదేవి రెండు చేతులలో కమలములను కలిగి ఉండడంతో పాటు, మరో రెండు చేతులలో అభయ,వరదముద్రలను ధరించి ఉన్నారు.
ఆలయ గోపురములు, రంగమండపములోని స్తంభాలు, ఉత్తర,దక్షిణ ద్వారమండపములోని స్తంభములపైన, దేవాలయ గోడలపైన అద్భుతమైన శిల్పసంపద భక్తులకు నయనానందకరాన్ని కలిగిస్తూ ఉంటుంది. శ్రీరాముడితో మాట్లాడుతూ ఉన్న ఆంజనేయుడు, పాశుపతాస్త్రంతో అర్జునుడు, గోపికావస్త్రాపహరణం, నటరాజమూర్తి, వీరభద్రుడు, ఆదిశేషుడు, బ్రహ్మ, తామలపుష్పంలో ఆశీనురాలైన శ్రీమహాలక్ష్మి, గంధర్వ స్త్రీలు వంటి అనేక శిల్పాలు నయనమనోహరంగా దర్శనమిస్తాయి. 


విజయగోపాల్ మల్లెల గారి సహకారంతో..
 

0 comments:

Post a Comment