Sunday 7 August 2011

ముగురమ్మల మూలపుటమ్మ

0 comments

అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనము్మల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్‌


 
అని బమ్మెర పోతనామాత్యుడు పరాత్పర అయిన ఆ ఆదిశక్తిని ఆరాధించాడు. భారతీయ ఆధ్యాత్మిక భావ భూమిక మహాశక్తి ప్రాతిపదికనే ఏర్పడింది. ఈ విశ్వంలో సమస్త సృష్టికి ఆమెయే చైతన్యం. ఆమెయే బుద్ధి, ఆమెయే నిద్ర.. మూల ప్రకృతి స్వరూపిణి ఆమె. త్రిమూర్తులైన సృష్టి, స్థితి, లయకారకులకు అమ్మవారే ఆలంబన. ఆమె శక్తి.. ఆమే సంపద.. ఆమే విద్య. దశమహా విద్యలకు అధిదేవత ఆమె. మృత్యువుకు, జరామరణాలకు అందనంత ఎత్తులో, అనంతమైన ఆనందామృత స్థితికి ఆమె అధినాయిక. రామాయణ, మహాభారతాలకు స్త్రీమూర్తే కేంద్ర బిందువై దుష్ట శిక్షణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయించింది. మహిషాసుర, నరకాసురాది అసుర శక్తుల సంహార విధుల్ని నిర్వర్తించింది. మన దేశంలో శక్తి స్వరూపిణి అయిన స్త్రీమూర్తిని ఆరాధించడం అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అనేక స్థాయిల్లో, అనేక దశల్లో, అనేక రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తుంది. అధోలోకం నుంచి ఊర్ధ్వలోకాల దాకా అనేక అంశల్లో అమ్మవారు పూజలందుకుంటుంటారు. తెలంగాణ ప్రాంతంలో చెరువు కట్టల వద్ద నెలకొన్న కట్టమైసమ్మ, గండి మైసమ్మ రూపాల నుంచి.. వారణాసిలో అన్నపూర్ణాదేవి వరకూ అనేక రూపాలలో అమ్మవారి సాక్షాత్కారం లభిస్తుంది.

దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న దేవీ ఆలయాల్లో మైసూరు సమీపంలోని చాముండేశ్వరీ దేవి ఆలయం మూర్తీభవించిన మహా శక్తి తత్తా్వనికి ప్రతీక. మైసూరు మహారాజా వారి రాజమందిరానికి, దసరా ఉత్సవాలకు మాత్రమే ప్రఖ్యాతి కాదు.. అంతకుమించి ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. మైసూరుకు సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరంలో ఎతై్తన కొండపై చాముండేశ్వరి దేవాలయం విరాజిల్లుతోంది. ఈ కొండ సైతం అమ్మవారి పేరుతోనే సార్థకమైంది. మైసూరు పట్టణం నుంచి చాముండి కొండవైపు చూస్తే అత్యద్భుతంగా కనిపిస్తుంది. మైసూరు సంస్థానాన్ని పరిపాలించిన మహారాజులంతా ఈ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి పరిచారు. దాదాపు వెయ్యి సంవత్సరాల ప్రాచీనమైనదైన ఈ ఆలయానికి 1794-1860 వరకు మైసూరును పాలించిన కృష్ణరాజ వొడియార్‌ అమ్మవారికి మహారాజ గోపుర నిర్మాణాన్ని గావించారు. ద్రవిడ సంప్రదాయం ప్రకారం నిర్మించిన ఈ గోపురం సుమారు నలభై అడుగుల ఎత్తు ఉంటుంది. మూడు వేల అడుగులకు మించిన ఎత్తుండటం వల్ల చాముండి కొండ మైసూరు పట్టణానికే తలమానికంగా నిలిచింది. కాలిబాటన వెళ్లాలంటే ఈ కొండకు అక్షరాలా వెయ్యి మెట్లు ఎక్కాలి. గుడికి వెళ్లడానికి ఘాట్‌రోడ్డును కూడా నిర్మించారు. వెండి తొడుగుతో నిర్మించిన చాముండేశ్వరీదేవి ఆలయ ప్రధాన ద్వారంపై అమ్మవారి వివిధ అంశలు, పౌరాణిక గాధల చిత్రాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఇక గర్భగుడి సంగతి చూడాల్సిందే తప్ప వర్ణించడం సాధ్యం కాదు. మొత్తం పసిడి కాంతులు వెదజల్లుతుండే అమ్మవారి విగ్రహాన్ని ఎంతసేపు చూసినా చూడాలనే అనిపిస్తుంది. సాక్షాత్తు ఆదిశక్తి స్వయంభువుగా వెలసిన క్షేత్రం కాబట్టి గర్భగుడిలో ప్రవేశించగానే ఆమె ఆప్యాయంగా భక్తులను పలుకరిస్తుంది. ఆమె ప్రసన్న దృక్కులు భక్తుల మనసులను పరిశుద్ధి చేస్తాయి. ఆ కాలంలో అమ్మవారిని మహిషాసుర మర్దినిగా పూజించారు. ఆలయ సమీపంలో అతి పెద్ద మహిషాసురుడి విగ్రహం సైతం కనిపిస్తుంది. ఈ కొండపైనే మహిషాసురుని అమ్మవారు వధించారని స్థల పురాణం చెప్తుంది. మైసూరు పట్టణమే శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందంటే అందుకు కారణం చాముండేశ్వరి దేవి అనుగ్రహమే. అంతేకాదు.. ఇక్కడ శివకేశవులకు కూడా ఎలాంటి భేదం లేకుండా పూజలు జరుగుతాయి. శివుడిని మహాబలేశ్వరుడిగా, విష్ణువును నారాయణుడిగా పూజిస్తారు. ఆలయానికి వెళు్తంటే మార్గమధ్యంలో మహా నందీశ్వరుడి విగ్రహం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సుమారు అయిదు మీటర్ల ఎత్తు, ఎనిమిది మీటర్ల పొడవున్న గొప్ప విగ్రహం ఇది. ఇది పేరుకు విగ్రహమే అయినా, సజీవంగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. విగ్రహాల్లో ప్రాణప్రతిష్ఠ చేయడం అంటే, ఈ విధంగా జీవంతం చేయడమే అని చెప్పవచ్చు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, మన రాష్ట్రంలోని లేపాక్షి ఆలయంలోని నందీశ్వరులతో సమాన స్థాయిలో ఉన్న బృహన్నంది ఇది.
ఈ కొండకు దక్షిణం వైపున మార్కండేశ ముని ఆశ్రమం ఎంతో ప్రశాంత వాతావరణంలో మనకు కనిపిస్తుంది. దీనికి సమీపంలో జ్వాలాముఖి త్రిపుర సుందరి ఆలయం ఉంది. ఈ కొండపైన ఎప్పటికీ నిండుకోని పవిత్ర జలాశయాలు రెండు ఉన్నాయి. ఒకటి దేవ గంగ కాగా.. మరొకటి పాతాళ వాహిని. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా ఈ రెంటిలో పవిత్ర స్నానాలు చేస్తారు.
ఈ ఆలయ సందర్శనం ఒక అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది. ఎతై్తన కొండపై అంతకంటే ఎత్తున, అద్భుత నిర్మాణ రీతిలో అలరారే ఆలయాన్ని చూడటానికి వేయి కన్నులు చాలవు.


ఈ విధంగా అమ్మవారిని సేవించిన వారికి

"రాజ్యమర్థించు వారికి రాజ్యమబ్బు

విద్య నర్థించు వానికి విద్యయబ్బు
స్వర్గమర్థించువానికి స్వర్గమబ్బు
మోక్షమర్థించువానికి మోక్షమబ్బు"

0 comments:

Post a Comment